హైదరాబాద్: ఇస్మాయిల్ ముస్లింల ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఆగాఖాన్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నాయకుడిగా నియమితులైన కరీం ఏఎల్ హుస్సేనీ ఆగాఖాన్ IV మరణం మానవాళికి తీరని లోటు అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్తగా, మానవతావాదిగా ప్రపంచవ్యాప్తంగా ఆగాఖాన్ ప్రత్యేక గుర్తింపు పొందారని, ఆగాఖాన్ ఫౌండేషన్ ద్వారా వివిధ దేశాల్లో ఆసుపత్రులు, విద్యా, సాంస్కృతిక సంస్థలను నెలకొల్పి సమాజానికి ఆయన అందించిన విశేష సేవలను రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
పేదరిక నిర్మూలన, వారసత్వ సంపద పరిరక్షణ, వైద్య సేవలు, విద్య రంగాల్లో అగాఖాన్ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్‌లో ఆగాఖాన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సంస్థలు అభినందనీయమన్నారు. ఆగాఖాన్ తన జీవితాంతం మానవతా గౌరవాన్ని పెంచే ఉన్నత విలువలను పాటించారని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన వారసులకు, కుటుంబ సభ్యులకు, అనుచరులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.